పెద్దపల్లి, జులై 31:రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు ఎం.డీ. రహీంపాషాకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ పెద్దపల్లి పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది.రామగిరి మండలం పన్నూర్ గ్రామం శివరాంనగర్కు చెందిన ఎం.డీ. రహీంపాషా (36)పై ఈ కేసు నమోదైంది. 2020 నవంబర్ 5న 14 ఏళ్ల బాలిక ఇంటి నుంచి కనిపించకుండా పోయిందని ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామగిరి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెం.138/2020 కింద తొలుత ఐపీసీ 363 సెక్షన్‌పై కేసు నమోదు చేశారు.దర్యాప్తులో బాలికను గుర్తించి ఆమె వాంగ్మూలం నమోదు చేయగా, నిందితుడు ప్రేమ వివాహం పేరుతో మోసపూరితంగా బాలికను తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు వెల్లడైంది. దీంతో ఐపీసీ 366-ఏ, 376(2)(3) సెక్షన్లతో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 6ను చేర్చి కేసును దర్యాప్తు చేశారు.అప్పటి ఏసీపీ వి. ఉమేందర్, ఎస్ఐ ఏ. మహేందర్ దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. పెద్దపల్లి పోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ కొనసాగగా, ఇరుపక్షాల వాదనలు, సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి శ్రీమతి స్వప్నరాణి నిందితుడిపై నేరారోపణలు రుజువైనట్లు నిర్ధారించి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించారు.నిందితుడికి శిక్ష పడేలా చేయడంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్, భరోసా లీగల్ కౌన్సిలర్ ఎం. సాధ్యారాణి కీలకంగా వ్యవహరించారు.పెద్దపల్లి డీసీపీ భూక్య రాంరెడ్డి, ఏసీపీ మడుత రమేష్ పర్యవేక్షణలో సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టడంలో సీఐ బుద్దె స్వామి (మంథని), ఎస్ఐ టీ. శ్రీనివాస్ (రామగిరి), కోర్టు కానిస్టేబుల్ సీడీఓ ఎస్.కె. షాహాబాజ్ (పీసీ-648), లైజన్ ఆఫీసర్ పి. కోటేశ్వరరావు (హెచ్‌సీ-2465) సహకరించారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని రామగుండం పోలీస్ కమిషనర్, డీఐజీ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.

