రామకృష్ణాపూర్,జూలై 22:మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గద్దెరేగాడి ప్రాంతంలో అనుమానాస్పదంగా పాము, విషపురుగు కాటుకు గురైన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తాండూర్ మండలం కిష్టంపేట్ గ్రామానికి చెందిన బండి ఎర్రయ్య, అతని భార్యతో కలిసి గత నాలుగు నెలలుగా గద్దెరేగాడి ప్రాంతంలో కొత్తగా నిర్మించిన భవనంలో వాచ్‌మన్‌గా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. ఎర్రయ్య పెద్ద కుమారుడు బండి సాగర్ (23) కూలీ పనులు చేస్తూ కిష్టంపేట్‌లో కుటుంబంతో నివసిస్తున్నాడు.ఈ నెల 13న తల్లిదండ్రులను చూసేందుకు గద్దెరేగాడికి వచ్చిన సాగర్, మరుసటి రోజు కూలీ పనికి వెళ్లి రాత్రి తల్లిదండ్రుల వద్దే బస చేశాడు. అదే రాత్రి మూత్రవిసర్జన కోసం బయటకు వెళ్లి వచ్చిన అనంతరం ఎడమ భుజం వద్ద ఏదో కుట్టినట్లు అనిపించిందని చెప్పి తిరిగి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం ఎడమ భుజం వద్ద మంటగా ఉందని, నాలుక మందమవుతోందని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వెంటనే 108 అంబులెన్స్ ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.వైద్యుల సూచన మేరకు అనంతరం కరీంనగర్‌లోని ఆరోగ్య ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జూలై 21 సాయంత్రం సాగర్ మృతి చెందాడు.పాము కాటు,విషపురుగు కాటు కారణంగా తన కుమారుడు మృతి చెందినట్లు తండ్రి బండి ఎర్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

