మంచిర్యాల, జూలై 4: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మంచిర్యాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అన్నా–అక్క మెంటార్షిప్ కార్యక్రమంలో భాగంగా కృత్రిమ మేధస్సుపై అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నిపుణుడు డాక్టర్ కె. నటరాజన్ ముఖ్య వక్తగా పాల్గొని విద్యార్థులకు కృత్రిమ మేధస్సు వినియోగం, ప్రాధాన్యంపై సమగ్రంగా వివరించారు.ప్రస్తుత కాలంలో విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు తదితర అనేక రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగం విస్తృతంగా పెరుగుతోందని, విద్యార్థులు ఈ సాంకేతికతపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. తాము నేర్చుకున్న అంశాలను సమీప ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా తెలియజేస్తూ సరైన అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు.ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు డాక్టర్ ఎం. కుమారస్వామి, ఎం.డి. రసూల్‌తో పాటు కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

