మంచిర్యాల,జూన్ 30:మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో వీధి వ్యాపారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ పథకం ద్వారా రుణాలు పొంది వ్యాపారాలను అభివృద్ధి చేసుకున్న పలువురు వ్యాపారులను ఈ సందర్భంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ వీధి వ్యాపారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొదటి విడతలో రూ.10 వేల రుణం, రెండవ విడతలో రూ.20 వేల రుణం, మూడవ విడతలో రూ.50 వేల రుణం పొంది వ్యాపారాలను అభివృద్ధి చేసుకున్న వారికి ఈ కార్యక్రమంలో అభినందనలు తెలిపారు.
ఈ పథకం ద్వారా రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన వారికి తిరిగి నగదు ప్రోత్సాహకం అందించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 7,537 మంది వీధి వ్యాపారులకు, 5,284 మంది లబ్ధిదారులకు ఈ ప్రయోజనం అందినట్లు వెల్లడించారు. అందులో భాగంగా ఎంపిక చేసిన 9 మంది వీధి వ్యాపారులకు సన్మానం చేశారు.ముఖ్యంగా శారీరక వైకల్యం కలిగిన కల్వకోట సంతోష్ రుణం పొంది వ్యాపారం అభివృద్ధి చేసుకోవడంతో పాటు తిరిగి నగదు ప్రోత్సాహకం పొందిన సందర్భంగా అధికారులు అభినందించారు.కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తోందని,ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ రాజు, ప్రాజెక్ట్ డైరెక్టర్ సుభాష్, లీడ్ బ్యాంక్ అధికారి తిరుపతి, మున్సిపల్ అధికారి చంద్రయ్య, మెప్మా సిబ్బంది, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, వనరుల వ్యక్తులు,వీధి వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

