మేడ్చల్-మల్కాజ్‌గిరి:మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా షమీర్‌పేట్ తహసీల్దార్ తుమ్మకొమ్మ సుచరితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఆమె నివాసంతో పాటు బంధువులు, అనుమానితుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.మొత్తం నాలుగు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో సుమారు రూ.5.05 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. సిద్దిపేట జిల్లా దామరకుంటలో 2 ఎకరాల 17 గజాల వ్యవసాయ భూమికి సంబంధించిన వివరాలు, హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో మూడు ఫ్లాట్ల పత్రాలు, కీసర, ఖానామెట్ ప్రాంతాల్లోని రెండు ప్లాట్ల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.తనిఖీల్లో రూ.12 లక్షల నగదు, వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ క్రెటా కార్లతో పాటు రెండు వాహనాలు, సుమారు రూ.1.20 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు గుర్తించినట్లు ఏసీబీ పేర్కొంది. బ్యాంకు ఖాతాల్లో రూ.38 లక్షల నిల్వలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది. పత్రాల్లో చూపిన విలువ కంటే ఆస్తుల మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఇప్పటికే రూ.30 లక్షల లంచం డిమాండ్ కేసులో సుచరితను ఏసీబీ అరెస్టు చేసింది. రూ.2 లక్షల పాక్షిక లంచం స్వీకరిస్తుండగా ఆమె ఏసీబీ వలలో చిక్కినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆమె న్యాయస్థానం ఆదేశాలతో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
ఇదిలా ఉండగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రతి సంవత్సరం తమ ఆదాయ వ్యయాలు, ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. లక్ష రూపాయలకు పైగా విలువైన వస్తువులు, ఆస్తుల కొనుగోలు వివరాలను స్వచ్ఛందంగా ప్రకటించి ఆదాయ వ్యయ నివేదికల్లో నమోదు చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ పలువురు ఉద్యోగులు వివరాలు సమర్పించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.నిబంధనలు పాటించని ఉద్యోగులకు ముందుగా నోటీసులు జారీ చేసి, నిర్ణీత సమయంలో వివరాలు సమర్పించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా సస్పెన్షన్, పదోన్నతి తగ్గింపు వంటి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

