మంచిర్యాల(నేన్నెల),జూన్ 24:మంచిర్యాల జిల్లా కేంద్రం నెన్నెల మండలం పుప్పల్వానిపేట గ్రామంలో నిర్వహించిన భూ సర్వే అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. ఎ.డి.ఎస్.ఎల్.ఆర్.శ్రీనివాస్,మండల తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవోతో కలిసి హాజరైన కలెక్టర్ భూ సమస్యల పరిష్కారంపై అధికారులకు,ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రికార్డులతో సరిపోల్చి నిబంధనల ప్రకారం పరిష్కరిస్తామని తెలిపారు.భూ సర్వేను సమగ్రంగా,పారదర్శకంగా నిర్వహించడం ద్వారా భవిష్యత్తులో భూ వివాదాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.పట్టాదారులు తమ భూములకు సంబంధించిన సరైన పత్రాలతో సర్వేలో పాల్గొనాలని సూచించారు. బోగస్ దరఖాస్తులను పరిశీలించి రద్దు చేస్తామని, వివాదాల్లో ఉన్న భూములను చట్టపరంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.అనంతరం నెన్నెల మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ అధికారుల హాజరు పట్టికను పరిశీలించి సమయపాలన పాటించాలని సూచించారు. భూభారతి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.అనంతరం కొన్నంపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల,అంగన్వాడీ కేంద్రం,మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎ.డి.ఎస్.ఎల్.ఆర్.శ్రీనివాస్,మండల తహసీల్దార్ శ్రీనివాస్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

