మంచిర్యాల, ఆగస్టు 9: ప్రజల రక్షణ, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ విధులు నిర్వహిస్తున్న పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతలోనూ ముందుంటున్నారు. రహదారులపై ప్రమాదకర పరిస్థితులను గుర్తించి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మంచిర్యాల పరిధిలోని ఏసీసీ క్వారీ మార్గంలోని రాళ్లవాగు వంతెన వద్ద రహదారి దెబ్బతిని కుంగిపోయింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. రహదారి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నప్పటికీ కొందరు వాహనదారులు అదే మార్గంలో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.సమాచారం అందుకున్న మంచిర్యాల ట్రాఫిక్ సీఐ హన్నన్ సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా తాత్కాలిక మరమ్మతులు చేపట్టడంతో పాటు క్వారీ వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయించారు. ప్రమాదకర ప్రాంతంలోకి వాహనదారులు ప్రవేశించకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా సీఐ హన్నన్ మాట్లాడుతూ.. దెబ్బతిన్న రహదారుల పరిస్థితిని గమనించి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు. ముఖ్యంగా వర్షాకాలంలో, రాత్రి వేళల్లో రహదారులపై ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.ప్రజల ప్రాణాలను కాపాడటం, ప్రమాదాలను ముందుగానే నివారించడం పోలీసుల ప్రధాన బాధ్యతల్లో భాగమని అధికారులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల భద్రతకు సంబంధించిన ప్రతి సందర్భంలో పోలీసులు తక్షణమే స్పందిస్తారని పేర్కొన్నారు. ప్రమాదం జరిగే అవకాశం ఉన్న ప్రాంతాన్ని గుర్తించి పోలీసులు సకాలంలో స్పందించి చర్యలు చేపట్టడంపై స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.

