తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళలు,పిల్లల భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు,మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో జిల్లా షీ టీమ్ ఇన్‌చార్జ్ ఎస్.ఐ. హైమ మంచిర్యాల ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు, పిల్లల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. పని ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు ఎదురైతే వెంటనే డయల్ 100 లేదా షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 6303923700కు సమాచారం అందించాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని,బాధితులు ఎలాంటి భయం లేకుండా ముందుకు రావాలని హామీ ఇచ్చారు.స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగిన నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌లైన్ మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.లింగ సమానత్వం సమాజ అభివృద్ధికి కీలకమని పేర్కొంటూ మహిళలు, పురుషులు సమాన హక్కులు, అవకాశాలు పొందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. బాలికలకు విద్య, ఆరోగ్యం, భద్రత కల్పించడం ద్వారా సమానత్వం సాధ్యమవుతుందని వివరించారు.బాల్య వివాహాలు పిల్లల భవిష్యత్తును దెబ్బతీసే సామాజిక సమస్యగా పేర్కొంటూ ఇవి ఆరోగ్య సమస్యలు,విద్యలో అంతరాయం,ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తాయని తెలిపారు.చట్టపరంగా బాల్య వివాహాలు నిషేధితమని స్పష్టం చేశారు.18 సంవత్సరాల లోపు బాలికల వివాహాలు జరగకుండా సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.బాల్య వివాహాలపై సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు లేదా హెల్ప్‌లైన్ 1098కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.భవిష్యత్తులో నర్సింగ్ వృత్తిలో చేరే విద్యార్థినులు తమ వృత్తి జీవితంలో కూడా భద్రతా నియమాలను పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుజాత, అసిస్టెంట్ ప్రొఫెసర్ వనజ,అధ్యాపక బృందం, షీ టీమ్ సిబ్బంది కానిస్టేబుళ్లు సతీష్, జ్యోతి, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

