హాజీపూర్,అక్టోబర్ 22 (నేటి ప్రజా తెలంగాణ):మంచిర్యాల జిల్లా కేంద్రం హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ గురువారం ఆకస్మికంగా సందర్శించి, వైద్య సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై వైద్య సిబ్బంది, పర్యవేక్షకులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 22 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 8 లక్షల జనాభా పరిధిలోని 2 లక్షల 12 వేల ఇళ్లలో 650 బృందాల ద్వారా సర్వే చేపడుతున్నట్లు వివరించారు. శరీరంపై స్పర్శ తెలియని మచ్చలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. కుష్టు వ్యాధిని బహుళ ఔషధ చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయవచ్చని, ప్రారంభ దశలో గుర్తించి చికిత్స తీసుకుంటే అంగవైకల్యాన్ని నివారించవచ్చని తెలిపారు. సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు.అలాగే క్షయ వ్యాధి నియంత్రణ, రక్తపోటు, మధుమేహం గుర్తింపు, మాతా శిశు సంరక్షణ, టీకాలు, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సిబ్బందికి ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ నివారణకు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ప్రతి వారం డ్రై డే నిర్వహించి దోమల వృద్ధిని అరికట్టాలని సూచించారు. రోగుల వివరాలను సంబంధిత పోర్టళ్లలో నమోదు చేయడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. ఆరోగ్య కేంద్రంలో సమాచార, అవగాహన సామగ్రి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, ఆరోగ్య కేంద్రం పర్యవేక్షకులు రఘుపతి, పద్మ, ఆరోగ్య సిబ్బంది, నర్సింగ్ అధికారులు పాల్గొన్నారు.

