మంచిర్యాల,ఆగస్టు 30 (నేటి ప్రజా తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని మెడికల్ గోడౌన్లో నిర్మించిన అధునాతన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ఈ నెల 31వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని 17 మండలాల పరిధిలో 691 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 42,450 మంది విద్యార్థులతో పాటు 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 6,654 మంది విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించనున్నట్లు తెలిపారు. రోజుకు 50 వేల మందికి ఆహారం అందించగల సామర్థ్యంతో ఈ కిచెన్‌ను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినట్లు పేర్కొన్నారు.హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ అమలు భాగస్వామిగా వ్యవహరిస్తుండగా, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల ద్వారా కిచెన్ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన సుమారు 8 వేల చదరపు అడుగుల షెడ్లో నిర్మించిన ఈ కిచెన్‌లో ఆహార నాణ్యత, పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలను అత్యున్నత స్థాయిలో నిర్వహించేందుకు ఫుడ్ ల్యాబ్, మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్, ఆర్ఓ వాటర్ ప్లాంట్, బాయిలర్ ప్లాంట్, సెంట్రల్ గ్యాస్ బ్యాంక్, ఆటోమేటిక్ వెజిటబుల్ వాషింగ్ అండ్ కటింగ్ యూనిట్ వంటి ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కిచెన్‌లోని ఆటోమేటెడ్ స్టీమర్ల ద్వారా గంటకు 5,600 ఇడ్లీలు, ఆటోమేటిక్ దోశ మెషీన్ ద్వారా గంటకు 2,000 దోశలు, ఆటోమేటిక్ పూరీ మెషీన్ ద్వారా గంటకు 3,600 పూరీలు తయారు చేసే సామర్థ్యం ఉందని తెలిపారు. సాంబార్, కూరల తయారీ యూనిట్ల ద్వారా రెండు గంటల్లో 5 వేల మంది విద్యార్థులకు సరిపడా ఆహారం, రైస్ కుకింగ్ పరికరాల ద్వారా కేవలం 40 నిమిషాల్లో 1,000 మందికి సరిపడా అన్నం తయారు చేయగల సామర్థ్యం ఉందని పేర్కొన్నారు.విద్యార్థులకు సమతుల్యమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సూచనల మేరకు వారపు మెనూను రూపొందించినట్లు తెలిపారు. ఈ కిచెన్ ద్వారా మంచిర్యాల, బెల్లంపల్లి, జన్నారం, మందమర్రి, లక్సెట్టిపేట, దండేపల్లి, కాజీపేట, నెన్నాల్, హాజీపూర్, నాస్పూర్, భీమారం మండలాలతో పాటు జగిత్యాల జిల్లాలోని వెల్లటూరు, ఎండపల్లి, పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, అంతర్గాం, పాలకుర్తి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.విద్యార్థులు ఉదయం పూట ఆకలితో పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు వెళ్లకుండా ఆరోగ్యకరమైన, పోషకాహారంతో కూడిన అల్పాహారం తీసుకుని ఉత్సాహంగా విద్యను అభ్యసించేలా చేయడం స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. పరిశుభ్రమైన వాతావరణంలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ప్రతిరోజూ వేలాది మంది విద్యార్థులకు అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, పోషకాహారం, ఏకాగ్రత, విద్యాభ్యాసంపై సానుకూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

