September 10, 2026
Praja Telangana
తెలంగాణ

*మంత్రాలు చేస్తున్నారనే మూఢనమ్మకంతో మహిళ హత్య.. ఇద్దరు నిందితుల అరెస్టు*

దండేపల్లి,సెప్టెంబర్ 9(నేటి ప్రజా తెలంగాణ): మంత్రాలు చేస్తున్నారనే మూఢనమ్మకంతో మహిళను గొడ్డలితో నరికి హత్య చేసిన ఇద్దరు నిందితులను దండేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన దండేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నెల్కి వెంకటాపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. నిందితుల అరెస్టు వివరాలను మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాశ్, లక్షెట్టిపేట సీఐ రమణమూర్తితో కలిసి వెల్లడించారు.పోలీసుల వివరాల ప్రకారం.. నెల్కి వెంకటాపూర్ గ్రామానికి చెందిన సింగతి రాంబాయికి కొంతకాలంగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో, అదే గ్రామానికి చెందిన సింగతి లచ్చన్న భార్య సింగతి లక్ష్మి మంత్రాలు చేయడం వల్లే తమ ఆరోగ్యం క్షీణిస్తోందని రాంబాయి, ఆమె కుమారుడు సింగతి రమేష్ అపోహకు గురయ్యారు. లక్ష్మిని హత్య చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని మూఢనమ్మకంతో భావించి ఆమెను హత్య చేసేందుకు పథకం వేశారు.ఈ క్రమంలో మంగళవారం రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో లక్ష్మి భర్త ఇంట్లో లేని సమయంలో రమేష్ గొడ్డలితో ఇంట్లోకి ప్రవేశించి లక్ష్మిపై దాడి చేసి హత్య చేశాడు. రాంబాయి ఇంటి బయట కాపలాగా ఉండగా, హత్య అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నమ్మదగిన సమాచారం మేరకు గూడెం దేవాలయం వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గొడ్డలి, సెల్‌ఫోన్, గ్లామర్ మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఉత్తర్వులతో, ఏసీపీ ఆర్.ప్రకాశ్ పర్యవేక్షణలో లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, జన్నారం ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్, దండేపల్లి ఎస్‌ఐ రాజవర్ధన్, లక్షెట్టిపేట ఎస్‌ఐ సురేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు నిందితులను అరెస్టు చేశాయి. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్, డీసీపీ అభినందించారు.మూఢనమ్మకాల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హత్యలు, ఇతర నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ ఆర్.ప్రకాశ్ హెచ్చరించారు. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు మూఢనమ్మకాలను ఆశ్రయించకుండా వైద్యులను సంప్రదించాలని, సమస్యలు ఎదురైతే చట్టపరమైన మార్గాలను అనుసరించాలని ప్రజలకు సూచించారు.

Related posts

బిజెపి తోనే దేశాభివృద్ధి సాధ్యం..47వ డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థి వెరబెల్లి రవీందర్ రావు

తెలంగాణ అంబెడ్కర్ యువజన సంఘం జిల్లా మహిళ కన్వీనర్ గా మద్దెల భావని*

నెన్నెల్ లో కత్తిపోటు నిందితుడు అరెస్ట్

Share this