రామకృష్ణాపూర్, సెప్టెంబర్ 2 (నేటి ప్రజా తెలంగాణ): రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్‌సింగ్‌నగర్‌లో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన పిన్నింటి మహేందర్ (39), ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మద్యపానానికి అలవాటు పడిన మహేందర్‌కు ఆ అలవాటు కారణంగా వివాహ సంబంధాలు పలుమార్లు విఫలమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సెప్టెంబర్ 1న రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఇంటికి వచ్చిన మహేందర్ తన వివాహ విషయం, కుటుంబ ఆస్తి తన పేరుపై బదిలీ చేయాలనే విషయంపై తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. అనంతరం ఇంటి బయటకు వచ్చి తలుపుకు బయట నుంచి తాళం వేసి ఇంటి ముందు వరండాలోని మంచంపై నిద్రించాడు. అదే రోజు రాత్రి సుమారు 10:45 గంటలకు మహేందర్ తండ్రి పిన్నింటి బుచ్చిరాజయ్య (59) నైట్ షిఫ్ట్ విధులకు వెళ్లాల్సి ఉండటంతో తలుపు తీయమని కుమారుడిని పిలిచారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇంటి వెనుక వైపు ఉన్న తలుపు ద్వారా బయటకు వచ్చి చూడగా, ఇంటి ముందు ఉన్న షెడ్‌లో పైపుకు చీరతో ఉరి వేసుకుని మహేందర్ వేలాడుతూ కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై మృతుడి తండ్రి బుచ్చిరాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

