September 10, 2026
Praja Telangana
తెలంగాణ

*బహిరంగ మద్యం సేవనంపై నిషేధం కొనసాగింపు: సీపీ అంబర్ కిషోర్ ఝా*

రామగుండం,సెప్టెంబర్ 1(నేటి ప్రజా తెలంగాణ): రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్‌లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. ఈ నిషేధాజ్ఞలు సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 1, 2026 వరకు అమల్లో ఉంటాయని, పరిస్థితులను బట్టి పొడిగించే అవకాశం ఉందని తెలిపారు.అదేవిధంగా మంచిర్యాల, పెద్దపల్లి జోన్‌లలో అధిక శబ్దంతో డీజే సౌండ్స్ వినియోగంపై ఉన్న నిషేధాన్ని కూడా పొడిగించారు. చిన్నారులు, వృద్ధులు, రోగులు, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమాలకు మైక్ సెట్ అవసరమైతే సంబంధిత డివిజన్ ఏసీపీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు.రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్, 1348 ఫసలీ, పోలీస్ యాక్ట్–1861 తదితర నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 1 ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 1 ఉదయం 6 గంటల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని కమిషనర్ తెలిపారు. ఈ కాలంలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే ముందస్తుగా పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.బంద్‌ల పేరుతో సంస్థలు, కార్యాలయాలను బలవంతంగా మూసివేయించడం, బెదిరింపులు లేదా ఒత్తిళ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై బీఎన్‌ఎస్ సెక్షన్ 223తో పాటు సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు ప్రజలు, అన్ని వర్గాల వారు సహకరించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కోరారు.

Related posts

*హెపటైటిస్ నివారణకు అప్రమత్తతే రక్షణ.. ప్రపంచ హైపటైటిస్ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన ర్యాలీ*

Chief Editor: Satish Kumar

*సెప్టెంబర్ 12న లోక్ అదాలత్.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి నిరోష*

Chief Editor: Satish Kumar

తెలంగాణలో రాజకీయ విస్తరణకు జనసేన కార్యాచరణ.. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండా

Share this