మంచిర్యాల,సెప్టెంబర్ 1(నేటి ప్రజా తెలంగాణ):
మంచిర్యాల పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని సిటీ న్యూరో, శ్రీహర, ఆదిత్య, సచిన్ ఆసుపత్రులను సందర్శించి వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆసుపత్రుల నిర్వహణ తీరును పరిశీలించారు.అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) ద్వారా అందిస్తున్న వైద్య సేవలు, ఆసుపత్రులు సమర్పించిన వైద్య బిల్లులను పరిశీలించారు. ఆసుపత్రుల్లో వైద్యుల వివరాలు, ప్రత్యేక వైద్య నిపుణుల వివరాలు, వైద్య సేవలకు సంబంధించిన చార్జీల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు.రోగులకు కూర్చునే సౌకర్యం, తాగునీరు, వీల్‌చైర్లు, స్ట్రెచర్లు అందుబాటులో ఉంచాలని, రోగులు ఆసుపత్రికి వచ్చినప్పుడు సహాయక సిబ్బంది అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, చికిత్స విధానం గురించి తగిన కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు.ప్రతి ఆసుపత్రిలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, సంబంధిత ఫైర్ సేఫ్టీ, బయోమెడికల్ వేస్ట్ సర్టిఫికెట్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. లీజ్ పత్రాలు, ట్రేడ్ లైసెన్స్, ఆసుపత్రిలో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది వివరాలను సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించారు.ఆసుపత్రులకు వచ్చే కన్సల్టెంట్ వైద్య నిపుణుల వివరాలు, వారు అందించే వైద్య సేవలను తెలియజేస్తూ బ్యానర్లు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. రోగులతో సమన్వయంతో వ్యవహరిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. డెంగ్యూ వంటి వ్యాధుల విషయంలో రోగులను భయభ్రాంతులకు గురిచేయకుండా, వాస్తవ పరిస్థితులను వివరిస్తూ అవసరమైన వైద్య సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు.క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం జిల్లాలోని అన్ని ఆసుపత్రులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని డాక్టర్ నరేందర్ రాథోడ్ స్పష్టం చేశారు. ఆయుర్వేద, యునాని, హోమియోపతి, సిద్ధ, అల్లోపతి, డెంటల్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలు, ల్యాబొరేటరీలు కూడా నిబంధనల ప్రకారం క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ పరిధిలో నమోదు చేసుకుని పనిచేయాలని సూచించారు.నిబంధనల అమలులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, రోగులకు మెరుగైన, సురక్షితమైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ ఆదేశించారు. తనిఖీ చేసిన నాలుగు ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ తనిఖీల్లో ఆయా వైద్యులు డాక్టర్ అబ్బూరి శ్రీనివాస్, డాక్టర్ గంప మల్లేష్, డాక్టర్ ప్రతాప్ గౌడ్, డాక్టర్ వినోద్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

