రామగుండం,ఆగస్టు 29(నేటి ప్రజా తెలంగాణ): రాష్ట్రస్థాయిలో క్రైమ్ పారామీటర్ల అమలులో రామగుండం పోలీస్ కమిషనరేట్ ఉత్తమ ప్రతిభ కనబరిచింది. రాష్ట్రంలోని వివిధ పోలీస్ యూనిట్ల పనితీరును సమీక్షించిన అధికారులు అత్యుత్తమ పనితీరు కనబరిచిన యూనిట్లను గుర్తించారు. ఇందులో క్లస్టర్–Iలో హైదరాబాద్, క్లస్టర్–IIలో రామగుండం, క్లస్టర్–IIIలో నల్గొండ, క్లస్టర్–IVలో సూర్యాపేట పోలీస్ యూనిట్లు మొదటి స్థానాల్లో నిలిచాయి.ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్‌కు శుక్రవారం డీజీపీ సీవీ ఆనంద్ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. క్రైమ్ నియంత్రణ, కేసుల దర్యాప్తు, పోలీస్ విధుల సమర్థవంతమైన నిర్వహణలో కనబరిచిన పనితీరును ప్రశంసించారు.ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ మరింత సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని, ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ముందుకు సాగాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు.

