September 10, 2026
Praja Telangana
తెలంగాణ

*మాదక ద్రవ్యాల నియంత్రణతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు:కలెక్టర్ కుమార్ దీపక్*

మంచిర్యాల,ఆగస్టు 27:మంచిర్యాల జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణ దిశగా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో డీసీపీ ఎ.భాస్కర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌లతో కలిసి జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్య రహిత మంచిర్యాల జిల్లా సాధనలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు 49 కేసులు నమోదు కాగా, 103 మందిని గుర్తించినట్లు, మాదకద్రవ్యాల వినియోగదారులను గుర్తించి కోర్టు ద్వారా 30 మందిని డ్రగ్ డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలించి కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యాసంస్థల్లో విద్యార్థులతో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి నెల అవగాహన కార్యక్రమాలు, మాదకద్రవ్యాల నియంత్రణపై క్విజ్, డ్రాయింగ్ తదితర పోటీలు నిర్వహించాలని సూచించారు. విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహించడం, పొగాకు సంబంధిత ఉత్పత్తులను విక్రయించడం నిషేధమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెడికల్, ఐటీఐ, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని, మద్యం దుకాణాలు నిర్ణీత సమయానికి మూసివేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు బెల్ట్ షాపులను నియంత్రించాలని తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గంజాయి తదితర మొక్కల సాగును గుర్తించాలని, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో మెడికల్ షాపులను నిత్యం పర్యవేక్షించి సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించే షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ, ఆర్టీసీ, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులతో రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలో అవసరమైన చోట్ల స్పీడ్ బ్రేకర్లు, రోడ్డు భద్రత సూచికలు ఏర్పాటు చేయాలని, రోడ్లపై చెత్త, ఆటంకాలను వెంటనే తొలగించాలని, అనధికార వాహనాల నిలుపుదల, నిబంధనల ఉల్లంఘనపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ విజిబిలిటీ ఉన్న ప్రాంతాల్లో లైటింగ్, జాతీయ రహదారులపై రంబుల్ స్ట్రిప్స్, లైటింగ్, జాగ్రత్త సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఓవర్‌లోడింగ్, మితిమీరిన వేగం, డ్రంక్ అండ్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై అవగాహన కల్పించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 95 డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసినట్లు తెలిపారు. ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై చర్యలు తీసుకోవాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రోడ్లపై సంచరించే పశువులను గోశాలలకు తరలించాలని, నూతన గోశాల ఏర్పాటుకు కేటాయించిన భూమిలో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాసరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ ఏసీపీలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

*డయల్ 112కు సమాచారం.. అప్రమత్తతతో బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన రామకృష్ణాపూర్ పోలీసులు*

Chief Editor: Satish Kumar

సమ్మర్ కోచింగ్ క్యాంపులు – 2026 ప్రారంభం:జిల్లా యువజన & క్రీడా శాఖ అధికారి

Chief Editor: Satish Kumar

మల్ల్యాల మండలంలో శ్రీ స్వామి వారి జాతర ఉత్సవాలు ప్రారంభం

Share this