మంచిర్యాల, ఆగస్టు 25 (నేటి ప్రజా తెలంగాణ): జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ, లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో నేత్రదాన అవగాహన కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నేత్రదాన అవశ్యకతను వివరించే కరపత్రాలను విడుదల చేశారు.డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు జిల్లావ్యాప్తంగా నేత్రదానం, దాని ప్రాముఖ్యతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అంధత్వ నివారణ అధికారి ఆధ్వర్యంలో సామాజిక ఆరోగ్య కార్యక్రమాల్లో భాగంగా లైన్స్ క్లబ్, ఎన్జీవోల సహకారంతో ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలలు, మున్సిపల్ పరిధిలోని ఉద్యోగులు, సిబ్బంది, గ్రామాల్లో ఆశ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, వైద్యాధికారులు, మహిళా సంఘాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.కార్నియాకు దెబ్బలు, గాయాలు, పోషకాహార లోపం, వంశపారంపర్య కారణాలు, రసాయనాల వల్ల కలిగే ప్రమాదాల కారణంగా కొందరు చూపును కోల్పోతున్నారని వివరించారు. కంటి నల్లపాప తెల్లగా మారి చూపు కోల్పోయిన వారికి కార్నియా మార్పిడి ద్వారా చూపును ప్రసాదించే అవకాశం ఉందని తెలిపారు. మరణానంతరం నేత్రాలను దానం చేయడం ద్వారా ఇద్దరు చూపులేని వ్యక్తులకు వెలుగు అందించే అవకాశం ఉందని పేర్కొన్నారు.నేత్రదానం అన్ని మతాలకు చెందినవారు, స్త్రీలు, పురుషులు చేయవచ్చని తెలిపారు. నేత్రదానం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడంతో పాటు తమ కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చని పేర్కొన్నారు.లైన్స్ క్లబ్ మంచిర్యాల ప్రజలకు ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలతో పాటు నేత్రదానంపై అవగాహన కల్పించడం, అవసరమైన వారికి కంటి వైద్య సేవలు, శస్త్రచికిత్సల విషయంలో సహకరిస్తున్న తీరును డాక్టర్ నరేందర్ రాథోడ్ అభినందించారు. భవిష్యత్‌లోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించాలని, జిల్లాలోని అన్ని ఎన్జీవోలు నేత్రదానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ముందుకు రావాలని కోరారు.జిల్లా మాస్ మీడియా బృందం ఆధ్వర్యంలోనూ విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, రషీద్ ఆధ్వర్యంలో, జిల్లా కంటి అధికారి శ్రీ శంకర్ సమన్వయంతో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. నేత్రదానంపై ప్రజలకు అవగాహన కల్పించే కరపత్రాలను విస్తృతంగా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ శ్రీధర్, నేత్ర వైద్య నిపుణులు, జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, జిల్లా కంటి అధికారి శ్రీ శంకర్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, రషీద్, నర్సింగ్ అధికారులు, సీహెచ్‌ఓలు పుట్టా సత్తయ్య, నాందేవ్, లైన్స్ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
previous post

