రామకృష్ణాపూర్, ఆగస్టు 25 (నేటి ప్రజా తెలంగాణ):తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసిన కేసులో ఓ వ్యక్తిని రామకృష్ణాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిమ్మాపూర్ గ్రామంలోని పద్మావతి కాలనీలో ఈ చోరీ ఘటన చోటుచేసుకోగా, నిందితుడిని తిమ్మాపూర్ చౌరస్తా వద్ద వాహన తనిఖీల సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.పోలీసుల వివరాల ప్రకారం.. పద్మావతి కాలనీకి చెందిన రెడ్డిమల్ల శోభారాణి (51), ఆమె భర్త ఉద్యోగ రీత్యా తిమ్మాపూర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 20న ఉదయం సుమారు 10 గంటల సమయంలో దంపతులు హైదరాబాద్‌లోని తమ కుమార్తె ఇంటికి వెళ్లారు. ఈ నెల 24న ఉదయం 9 గంటల సమయంలో తిరిగి ఇంటికి చేరుకోగా, ఇంటి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. లోపలికి వెళ్లి చూడగా అల్మారా తలుపులు తెరిచి ఉండటంతో పాటు అందులో భద్రపరిచిన ఆభరణాలు కనిపించలేదు.చోరీకి గురైన వస్తువుల్లో 1½ తులాల వెండి గొలుసు, 6 తులాల ముడి వెండి, 3 తులాల వెండి నాణేలు, ఒక బంగారు పుస్తె గుండు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో భాగంగా మంగళవారం ఉదయం తిమ్మాపూర్ చౌరస్తాలోని కేక్ జోన్ బేకరీ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో పోలీసులను గమనించి అనుమానాస్పదంగా తప్పించుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతడిని సిరికొండ శంకర్ (38), తండ్రి చంద్రయ్యగా గుర్తించారు. మందమర్రి 3వ జోన్‌కు చెందిన శంకర్ గత ఆరు సంవత్సరాలుగా న్యూ తిమ్మాపూర్‌లో నివాసం ఉంటూ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.విచారణలో ఈ నెల 23న రాత్రి పద్మావతి కాలనీలో తిరుగుతూ తాళం వేసి ఉన్న శోభారాణి ఇంటిని గుర్తించినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలను అపహరించినట్లు వెల్లడించినట్లు పేర్కొన్నారు. చోరీ చేసిన వస్తువులను విక్రయించి వచ్చిన డబ్బును వ్యక్తిగత అవసరాలు, విలాసవంతమైన జీవనానికి వినియోగించినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు రామకృష్ణాపూర్ ఎస్‌ఐ జై శ్రీధర్ తెలిపారు.
ప్రజలకు పోలీసుల సూచనలు: ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో తలుపులు, కిటికీలను తప్పనిసరిగా సురక్షితంగా లాక్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఎక్కువ కాలం ఇంట్లో ఎవరూ లేని సందర్భంలో నమ్మకమైన పొరుగువారికి సమాచారం ఇవ్వాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

