September 10, 2026
Praja Telangana
తెలంగాణ

*నవజాత శిశువు మృతి కేసులో ముగ్గురు అరెస్ట్*

మంచిర్యాల, ఆగస్టు 17 (నేటి ప్రజా తెలంగాణ):సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవజాత మగ శిశువును చెట్ల పొదల్లో వదిలివేయడంతో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.చైల్డ్ హెల్ప్‌లైన్ సెంటర్ జిల్లా సమన్వయకర్త మంతెన ప్రేమ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 206/2026 కింద భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 91, 93, 105, 45, 3(5) ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ప్రధాన నిందితురాలు గోమాస సంధ్య (30) భర్తతో మనస్పర్థల కారణంగా గత మూడేళ్లుగా తల్లిగారి వద్ద నివసిస్తోంది. ఈ క్రమంలో రామగిరి శ్రీనివాస్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ఏర్పడిన సంబంధం కారణంగా సంధ్య గర్భం దాల్చినట్లు పోలీసులు తెలిపారు. గర్భాన్ని తొలగించేందుకు సంధ్య, శ్రీనివాస్‌లు మెడికల్ షాపులో పనిచేసే తంగళ్ళపల్లి మనోజ్ కుమార్‌ను సంప్రదించగా, మనోజ్ కుమార్ తనతో కలిసి పనిచేసే చేల్లోజు సాయి కృష్ణను సంప్రదించినట్లు పేర్కొన్నారు. సాయి కృష్ణ ఐదు మాత్రలు తీసుకువచ్చి మనోజ్ కుమార్‌కు ఇవ్వగా, వాటిని సంధ్యకు అందించినట్లు పోలీసులు తెలిపారు.మాత్రలు తీసుకున్న అనంతరం ఈ నెల 10న సంధ్యకు మగ శిశువు జన్మించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం శిశువును ఎవరికీ కనిపించకుండా చేయాలనే ఉద్దేశంతో సంధ్య, శ్రీనివాస్‌లు శిశువును లక్ష్మీనగర్ సమీపంలోని చెట్ల పొదల్లో వదిలివేయాలని నిర్ణయించుకున్నారని, శ్రీనివాస్ శిశువును అక్కడ వదిలి వెళ్లినట్లు పేర్కొన్నారు.శిశువు ఏడుపు విన్న స్థానికులు వెంటనే 112కు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శిశువును ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శిశువు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
అరెస్టయిన నిందితులు: గోమాస సంధ్య (30),తంగళ్ళపల్లి మనోజ్ కుమార్ (21), చేల్లోజు సాయి కృష్ణ (34)లను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఎ-2 నిందితుడు రామగిరి శ్రీనివాస్ కోసం గాలింపు కొనసాగుతోంది.స్వాధీనం చేసుకున్న వస్తువులు: సంధ్య వద్ద నుంచి మైఫెప్రిస్టోన్, మిసోప్రోస్టోల్ మాత్రలు కలిగిన కాంబీప్యాక్ స్ట్రిప్‌తో పాటు రియల్‌మీ నలుపు రంగు స్మార్ట్‌ఫోన్, మనోజ్ కుమార్ వద్ద నుంచి ఐక్యూ జెడ్7 ప్రో నీలం రంగు స్మార్ట్‌ఫోన్,సాయి కృష్ణ వద్ద నుంచి రెడ్‌మీ నలుపు, ఎరుపు రంగు స్మార్ట్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను తదుపరి చట్టపరమైన ప్రక్రియలో భాగంగా సంబంధిత కోర్టులో హాజరుపరిచారు.మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ ఆధ్వర్యంలో పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేపట్టి, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ కేసును ఛేదించినట్లు డీసీపీ తెలిపారు. కేసు దర్యాప్తు అధికారిగా మంచిర్యాల రూరల్ సర్కిల్ సీఐ జి. రవీందర్ వ్యవహరించగా, సీసీసీ నస్పూర్ ఎస్‌ఐ-1 ఎం. ప్రశాంత్, ఎస్‌ఐ-2 టి. జితేందర్ సింగ్, ఏఎస్సై ఎం.డి. ఇజాజ్, పోలీస్ కానిస్టేబుళ్లు వెంకటసాయి, నరేందర్‌తో పాటు ఇతర పోలీసు సిబ్బంది దర్యాప్తులో సహకరించారు. దర్యాప్తు బృందాన్ని డీసీపీ ఎ.భాస్కర్ అభినందించారు.

Related posts

జర్నలిస్టులపై దాడులు అప్రజాస్వామీకం.

నిజమైన పాత్రికేయతకు ప్రాధాన్యం ఇవ్వాలి: కలెక్టర్ కుమార్ దీపక్

*జల్ సంచయ్ జన భాగీదారి–3.0లో ప్రజలందరూ భాగస్వాములు కావాలి: క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణ*

Share this