రామకృష్ణాపూర్,జూలై 18: కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జల్ సంచయ్ జన భాగీదారి (JSJB)–3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.వర్షపు నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, యువత ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని కోరారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతల ఏర్పాటు, నీటి వృథా నివారణ, భూగర్భ జలాల పెంపు, చెరువుల పరిరక్షణ, ప్రతి ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.ప్రతి ఇంటి వద్ద వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు భావితరాలకు నీటి భద్రతను కల్పించవచ్చని, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు.నీటి ప్రతి బొట్టు అమూల్యమని, భవిష్యత్ తరాలకు నీటి కొరత రాకుండా చూడాలంటే ప్రతి పౌరుడు బాధ్యతతో వ్యవహరించి నీటి సంరక్షణలో భాగస్వామి కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సహకారంతోనే జల్ సంచయ్ జన భాగీదారి–3.0 కార్యక్రమం విజయవంతమవుతుందని, అందరూ స్వచ్ఛందంగా పాల్గొని నీటి సంరక్షణ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.”నీటిని ఆదా చేద్దాం – భావితరాలకు భద్రత కల్పిద్దాం” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

