September 10, 2026
Praja Telangana
తెలంగాణ

*గంజాయి, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం.. రూ.17.09 లక్షల విలువైన 40.173 కిలోల గంజాయి ధ్వంసం*

రామగుండం పోలీస్ కమిషనరేట్,ఆగస్టు 5:గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 81 ఎన్‌డీపీఎస్ కేసుల్లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 40.173 కిలోల ఎండు గంజాయితో పాటు 26 గంజాయి మొక్కలను న్యాయస్థానం అనుమతితో ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. న్యాయాధికారుల సమక్షంలో కేసు ప్రాపర్టీ నుంచి ఎఫ్‌ఎస్‌ఎల్ పరీక్షల కోసం నమూనాలు సేకరించిన అనంతరం, కమిషనరేట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి గ్రామంలోని వెంకటరమణ ఇన్‌సినిరేటర్స్‌లో గంజాయిని దహనం చేసినట్లు తెలిపారు. ధ్వంసం చేసిన గంజాయి, గంజాయి మొక్కల మొత్తం విలువ సుమారు రూ.17,09,000 ఉంటుందని పేర్కొన్నారు.గంజాయి సాగు, రవాణా, నిల్వ, సరఫరా, విక్రయాలకు పాల్పడుతూ యువతను మత్తుకు బానిసలుగా మార్చే వారిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీపీ తెలిపారు. స్థానిక పోలీసులు, స్పెషల్ డ్రగ్ కంట్రోల్ టీమ్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను విక్రయించినా, రవాణా చేసినా, నిల్వ ఉంచినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మత్తు పదార్థాలను సేవించే వారిపైనా చట్టపరమైన కేసులు నమోదు చేయడంతో పాటు, అవసరమైతే పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, జైపూర్ ఏసీపీ ఎ. వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ అనిల్, ఎస్‌ఐ వినీత తదితరులు పాల్గొన్నారు.

Related posts

*పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష*

*ఎస్‌ఐఆర్ ఫారాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న జనసేన నాయకులు – ఇంటింటికీ వెళ్లి వివరాలు అందజేత*

బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం

Share this