August 5, 2026
Praja Telangana
తెలంగాణ

*బాలల హక్కుల పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య*

మంచిర్యాల,ఆగస్టు 1: బాలల హక్కుల పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వీరయ్య అన్నారు. శనివారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాలల హక్కుల పరిరక్షణ, పోక్సో చట్టంపై నిర్వహించిన ఒక్కరోజు అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డి.సి.పి. ఎ. భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, అదనపు సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రామ్ మోహన్ రెడ్డి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. నిరోషా, స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ (ఎక్సైజ్) బి. కృష్ణ తేజ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్త సత్తయ్యతో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బాలల హక్కుల పరిరక్షణ అధికారులను నియమించినట్లు తెలిపారు. ప్రస్తుత సమాజంలో విపరీతమైన పోకడలతో చిన్న వయసులోనే పిల్లలు దారి తప్పుతున్నారని, సోషల్ మీడియా ప్రభావం వల్ల పిల్లల్లో సైతం చెడు ప్రవర్తనకు అవకాశం ఏర్పడుతోందని తెలిపారు. పిల్లలకు వారి హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు చెడు వ్యసనాల వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించి, సమాజం పట్ల వారి బాధ్యతలను తెలియజేయాలని సూచించారు. సమసమాజ స్థాపనలో గురువుల పాత్ర అనిర్వచనీయమని, పిల్లలు, కళాశాల యువత మద్యపానం, మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉపాధ్యాయులు, అధ్యాపకులు బాధ్యతగా వ్యవహరించి వారిని సన్మార్గంలో నడిచే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ చిన్నతనంలోనే పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలని, గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలని తెలిపారు. పిల్లలకు వారి హక్కుల గురించి వివరించడంతో పాటు జె.జె., పోక్సో చట్టాలపై పిల్లలకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని, బాల కార్మికులను రక్షించి వారికి నిర్బంధ విద్య అందిస్తున్నామని తెలిపారు. లైంగిక వేధింపులు, దాడులకు గురైన బాధితులను గుర్తించడం, వారికి చట్టాలపై అవగాహన కల్పించడం, బాలలపై దాడులకు పాల్పడిన వారిని గుర్తించి కేసులు నమోదు చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. డి.సి.పి. ఎ. భాస్కర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితమవుతుందని, బాలల హక్కులను రక్షించడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, బాలలను సన్మార్గంలో నడిపించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. షీ టీమ్స్ ఆధ్వర్యంలో బాలికలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే అసాంఘిక అంశాలను నిరోధించి పిల్లలు వాటికి ప్రభావితం కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు, బాలల హక్కుల పరిరక్షణ సమితి అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అటవీ అధికారులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు రైతుల కోసం న్యాయవాది ఏమాజి పోరాటం

*మంచిర్యాల కార్పొరేషన్ సమావేశంలో బీజేపీ ఆందోళన.. అవినీతి ఆరోపణలపై విచారణకు డిమాండ్*

Chief Editor: Satish Kumar

తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్*

Share this