August 5, 2026
Praja Telangana
తెలంగాణ

*తల్లిపాల ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించాలి: డి ఎం హెచ్ ఓ డాక్టర్.నరేందర్ రాథోడ్*

మంచిర్యాల, జులై 31: ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కరపత్రాలు, పోస్టర్లను విడుదల చేశారు. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, ప్రభుత్వాసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించాలని సూచించారు. తల్లిపాల వల్ల శిశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు నీళ్ల విరేచనాలు, నిమోనియా, అలర్జీలు, మధుమేహం వంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుందని తెలిపారు. తల్లి, బిడ్డ మధ్య అనుబంధం పెరగడంతో పాటు శిశువు శారీరక, మానసిక ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లులకు ప్రసవానంతర రక్తస్రావం తగ్గడం, గర్భాశయం సాధారణ స్థితికి చేరడం, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ ప్రమాదం తగ్గడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. వైద్యపరంగా అవసరం లేని సందర్భాల్లో బిడ్డకు తల్లిపాలు తప్ప ఇతర ఆహారం, పానీయాలు ఇవ్వకూడదని, బిడ్డ కోరిన ప్రతిసారి తల్లిపాలు అందించేలా ప్రోత్సహించాలని సూచించారు. గ్రామాల్లో తల్లులు, కుటుంబ సభ్యులకు తల్లిపాల ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, విశ్వేశ్వర్ రెడ్డి, డీపీఓ ప్రశాంతి, బసుమతి సుమన్, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

బెల్లంపల్లి ఆటో యూనియన్ నుండి అధిక సహాయం

*మాతా శిశు సంరక్షణ కేంద్రం, తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌లో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ.. వైద్య సేవల మెరుగుపై ఆదేశాలు*

Share this