మంచిర్యాల,జూలై 27(నేటి ప్రజాతెలంగాణ):వర్షాకాలంలో వ్యాధుల నివారణకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. నరేందర్ రాథోడ్ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా వైద్యాధికారుల సమీక్ష సమావేశంలో వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, వర్షాకాలంలో డెంగీ, మలేరియా, డయేరియా వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. మాతా–శిశు సంరక్షణ కార్యక్రమాన్ని శాతం వంద అమలు చేస్తూ గర్భిణుల నమోదు, హైరిస్క్ గర్భిణుల గుర్తింపు, అవసరమైన పరీక్షలు, మాతా శిశు సంరక్షణ పోర్టల్, యూ-విన్ పోర్టల్‌లో వివరాల నమోదును పూర్తి చేయాలని ఆదేశించారు.జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని వేగవంతం చేసి, అనుమానిత బాధితులను గుర్తించి సకాలంలో చికిత్స అందించాలని, మారుమూల ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. ఆశా కార్యకర్తలు గ్రామాల్లో నిరంతరం పర్యటిస్తూ పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతి ఇంటిలో ఓఆర్‌ఎస్ అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు.30 ఏళ్లు పైబడిన వారికి అసంక్రమణ వ్యాధుల స్క్రీనింగ్ నిర్వహించి మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులను గుర్తించి చికిత్స అందించాలని, టెలి-మనస్ కార్యక్రమాన్ని శాతం వంద పూర్తి చేయడంతో పాటు పాఠశాలలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. సుధాకర్ నాయక్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. అరుణశ్రీ, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, సీహెచ్‌ఓ కాకిరాల వెంకటేశ్వర్లు, డీడీఎం ప్రవళిక, జిల్లాలోని వైద్యాధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

