మంచిర్యాల,జులై 30: అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థపై తప్పుడు కథనాలు ప్రచురిస్తామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై ముగ్గురు విలేకరులపై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుడు, అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని గుర్రాల శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఫిర్యాదు వివరాల ప్రకారం, గత కొంతకాలంగా సంస్థపై ఎలాంటి ఆధారాలు లేకుండా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ, అసత్య కథనాలు ప్రచురిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో జూన్ 29న ఒక వార్త ప్రచురించిన అనంతరం, తెలుగు ప్రభ దినపత్రికకు చెందిన రిపోర్టర్ అనీష్ తమ కార్యాలయానికి వచ్చి, సంస్థపై ప్రతికూల వార్తలు ప్రచురించకుండా ఉండాలంటే తనతో పాటు గొర్లపల్లి సురేష్‌కు రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు.తాము ఎలాంటి తప్పు చేయలేదని, డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించగా, డబ్బులు ఇవ్వకుంటే ప్రతిరోజూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక అదే రోజు రాత్రి 100 ఫీట్ రోడ్డులోని తమ కార్యాలయంలో అనీష్‌కు రూ.50 వేల నగదు ఇచ్చానని, మిగిలిన మొత్తం తరువాత ఇస్తానని చెప్పినట్లు వెల్లడించారు.ఆ తర్వాత మిగిలిన డబ్బుల కోసం గొర్లపల్లి సురేష్ వాట్సాప్ ద్వారా నిరంతరం సందేశాలు పంపుతూ వేధింపులకు గురిచేశాడని, డబ్బులు ఇవ్వకపోవడంతో సంస్థపై సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడని ఆరోపించారు. అనంతరం అగ్నిధార దినపత్రికకు చెందిన రవికుమార్ యాదవ్ కూడా వారితో కలిసి సంస్థపై అసత్య కథనాలు ప్రచురిస్తూ బెదిరింపులకు దిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ వ్యవహారానికి సంబంధించి నిందితులు పంపిన వాట్సాప్ సందేశాలు, బెదిరింపు ఫోన్ కాల్ సంభాషణలు, పెన్‌డ్రైవ్‌లో భద్రపరిచిన వీడియోలు, సోషల్ మీడియా పోస్టుల స్క్రీన్‌షాట్లను పోలీసులకు ఆధారాలుగా సమర్పించినట్లు బాధితుడు తెలిపారు. తమను బెదిరించి డబ్బులు వసూలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు.గుర్రాల శ్రీధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.ఈ సందర్భంగా గుర్రాల శ్రీధర్ మాట్లాడుతూ, గతంలో తమ సంస్థ నుంచి డబ్బులు తీసుకున్న కొందరు వ్యక్తులు కావాలనే సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతో తప్పుడు వార్తలు రాయించడం, ఆర్‌టీఐ దరఖాస్తులు, ఫిర్యాదులు చేయించడం, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ చర్యలను ఇకపై సహించబోమని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

