నస్పూర్,జూలై 24: మంచిర్యాల పురపాలక పరిధిలోని నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సీతారాంపల్లి రైతు వేదికలో శుక్రవారం నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్ సందర్శించి సేవల అమలును పరిశీలించారు.ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.క్షయవ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఫోర్టేబుల్ మొబైల్ డిజిటల్ ఎక్స్‌రే యూనిట్ ద్వారా శిబిరానికి వచ్చిన వారికి ఛాతీ ఎక్స్‌రేలు, కఫ పరీక్షలు నిర్వహించి అనుమానిత క్షయ రోగులను గుర్తించాలని సూచించారు. అలాగే జాతీయ అసంక్రమణ వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా 30 సంవత్సరాలు పైబడిన వారికి రక్తపోటు, రక్తంలో చక్కెర పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేయడంతో పాటు వివరాలను నిశ్చయ్ పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు. క్షయ రోగులకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో పోషకాహార కిట్లను అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.వర్షాకాలం నేపథ్యంలో మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా ప్రతి గ్రామంలో డ్రై డే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి వారం ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడం, వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం, రోడ్లపై విక్రయించే ఆహార పదార్థాలను తినకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడంలో భాగంగా మాతా-శిశు సంరక్షణ సేవలు, టీకాల కార్యక్రమం, 14 సంవత్సరాలు నిండిన బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, క్షయవ్యాధి మరియు కీటక జనిత వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ మెగా వైద్య శిబిరంలో మొత్తం 123 మందికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, రషీద్, స్థానిక కార్పొరేటర్ సిరిమల సౌమ్య, వైద్యాధికారులు డా. వెంకటేష్, డా. ప్రియాంక సలోని, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నాందేవ్, టీబీ పర్యవేక్షకులు సాయిరెడ్డి, రాజేష్, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

