September 12, 2026
Praja Telangana
తెలంగాణ

*సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలుతో రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయ చర్యలు : కలెక్టర్ కుమార్ దీపక్*

మంచిర్యాల, జూలై 21: సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల మేరకు జిల్లాలో రోడ్డు భద్రతకు సంబంధించిన అన్ని చర్యలను పకడ్బందీగా అమలు చేసి రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో డీసీపీ ఎ. భాస్కర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర రహదారులపై అనుమతించిన లే-బైలు, వే-సైడ్ సౌకర్య కేంద్రాలు మినహా ఇతర ప్రాంతాల్లో భారీ, వాణిజ్య వాహనాల పార్కింగ్‌ను పూర్తిగా నిషేధించాలని సూచించారు. దాబాలు, హోటళ్లు, వాణిజ్య సంస్థల సమీపంలో అక్రమ పార్కింగ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. ప్రమాదాలకు గురయ్యే బ్లాక్‌స్పాట్లను గుర్తించి అక్కడ వీధి దీపాలు, సీసీ కెమెరాలు, హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, రంబుల్ స్ట్రిప్‌లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ఇందారం వంతెన నుంచి గోదావరి వంతెన వరకు వీధి దీపాల ఏర్పాటు, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిర్వహణ, యూ-టర్న్‌ల పునర్వ్యవస్థీకరణ, రహదారుల షోల్డర్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించేందుకు జీపీఎస్ ఆధారిత నిఘా, ఈ-చలాన్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించాలని, ప్రతి 75 కిలోమీటర్లకు అంబులెన్స్, రికవరీ వాహనం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రహదారి హక్కు పరిధిలో ఆక్రమణలు, అనధికార నిర్మాణాలను తొలగించి భద్రతకు ఆటంకం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.అనంతరం డీసీపీ ఎ. భాస్కర్ మాట్లాడుతూ రహదారి భద్రతను బలోపేతం చేసేందుకు పోలీసు, రవాణా శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక హైవే సర్వైలెన్స్ బృందాలతో 24 గంటల పర్యవేక్షణ చేపడతామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, రాంగ్‌రూట్ డ్రైవింగ్, ఓవర్‌లోడ్ వాహనాలు, అక్రమ పార్కింగ్ వంటి ఉల్లంఘనలపై నిరంతర ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ రాహ్ వీర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించి, ప్రమాద బాధితులను తొలి గంటలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం నగదు ప్రోత్సాహకం, ప్రశంసాపత్రం అందజేస్తుందని వివరించారు.ఈ కార్యక్రమంలో రవాణా, జాతీయ రహదారులు, రోడ్లు-భవనాల, పోలీసు, మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

*వ్యాధుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి… డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్*

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రకృతిమిత్ర.. జిల్లా అటవీ శాఖతో కీలక భేటీ

నిజమైన పాత్రికేయతకు ప్రాధాన్యం ఇవ్వాలి: కలెక్టర్ కుమార్ దీపక్

Share this