September 11, 2026
Praja Telangana
తెలంగాణ

*వ్యాధుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి… డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్*

హాజీపూర్,ఆగస్టు 21 (నేటి ప్రజా తెలంగాణ):వర్షాకాలం, వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ వైద్య ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బందితో మాట్లాడి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.అనంతరం దొనబండ గ్రామంలో నిర్వహించిన ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో పాల్గొని దోమల నిర్మూలనకు చేపడుతున్న చర్యలను పరిశీలించారు. డెంగ్యూ, మలేరియా వంటి కీటక జనిత వ్యాధులు వ్యాపించకుండా పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, దోమల వృద్ధికి కారణమయ్యే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

30 ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేకంగా పరీక్షలు

ఉపకేంద్రాల పరిధిలో 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేసి అసంక్రమణ వ్యాధులైన బీపీ, షుగర్ తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. వ్యాధులు గుర్తించిన వారికి సకాలంలో మందులు అందించడంతో పాటు ఎన్‌సీడీ ఆన్‌లైన్ పోర్టల్‌లో వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు.ఆశా ఆరోగ్య కార్యకర్తలు తమ పరిధిలోని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించాలని తెలిపారు. ముఖ్యంగా వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధులు, కీటక జనిత వ్యాధులు, నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని సూచించారు.

ఆరోగ్య కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉంచాలి

ప్రతి ఉపకేంద్రం పరిధిలో డెంగ్యూ, మలేరియా, సికిల్ సెల్ తదితర వ్యాధులకు సంబంధించిన కిట్లు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ తమ విధుల్లో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించి వంటగదులు, వంట సామగ్రిని పరిశీలించడంతో పాటు విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఓఆర్‌ఎస్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

అంగన్‌వాడీ కేంద్రంలో పరిశీలన

దొనబండ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని కూడా డాక్టర్ నరేందర్ రాథోడ్ సందర్శించారు. అక్కడ పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, వైద్య సేవలను పరిశీలించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న ఆరోగ్య సేవల వివరాలను ఆరోగ్య కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు.వ్యాధుల నియంత్రణలో వైద్య సిబ్బందితో పాటు ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడీ సిబ్బంది, ఉపాధ్యాయులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు సమన్వయంతో పనిచేయాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, వైద్యులు డాక్టర్ సుధాకర్, డాక్టర్ పద్మ, ఆరోగ్య సిబ్బంది వెంకట సాయి, ఆశా ఆరోగ్య కార్యకర్తలు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

రేషన్ కట్ ఉండదు ఈ-కేవైసీకి గడువు లేదు

అక్రమ పశువుల రవాణాపై పోలీసుల కఠిన నిఘా: డీసీపీ ఏ. భాస్కర్

*ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీల భర్తీకి జూలై 6న స్పాట్ కౌన్సిలింగ్:: టిజిఎస్డబ్ల్యూఆర్ఐఈఎస్ సమన్వయకర్త రామ కళ్యాణి*

Share this