కాసిపేట, జూలై 16 (నేటి ప్రజా తెలంగాణ): ప్రజలకు భద్రత కల్పించడమే కాకుండా ఆరోగ్య సేవలను సైతం చేరువ చేయాలనే లక్ష్యంతో రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంచిర్యాల జోన్‌లోని కాసిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో దేవాపూర్ పోలీసులు మెడీలైఫ్ హాస్పిటల్, సన్‌రైజ్ హాస్పిటల్ సహకారంతో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాకు గ్రామ మహిళలు తిలకం దిద్ది, తలపాగా చుట్టి, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు, వాయిద్యాల నడుమ ఆయనను కార్యక్రమ వేదికకు తీసుకువచ్చారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపడటం శుభపరిణామమని అన్నారు. యువతతో పాటు కుటుంబ సభ్యులెవరూ మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలు వ్యక్తి, కుటుంబం, సమాజాన్ని నాశనం చేస్తాయని పేర్కొన్నారు.అదేవిధంగా ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌తోనే వాహనాలు నడపాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, మద్యం సేవించి వాహనాలు నడపడం పూర్తిగా మానుకోవాలని సూచించారు.ప్రజల భద్రత, సంక్షేమం కోసం రామగుండం పోలీస్ కమిషనరేట్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, శాంతియుత సమాజ నిర్మాణంలో ప్రజలు కూడా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. గ్రామ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న వైద్యులను ప్రత్యేకంగా అభినందించారు.ఉచిత వైద్య శిబిరంలో జనరల్ ఫిజీషియన్, పల్మనాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, రేడియాలజీ, కంటి వైద్య నిపుణులు సేవలందించగా, బీపీ, రక్తంలో చక్కెర పరీక్ష, ఈసీజీ, పీఎఫ్‌టీ, 2డీ ఎకో, అల్ట్రాసౌండ్, కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధితో పాటు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్, మందమర్రి సీఐ పి. రమేష్, దేవాపూర్ ఎస్‌ఐ గంగారం, కాసిపేట ఎస్‌ఐ ఆంజనేయులు, మందమర్రి ఎస్‌ఐ నరేష్, రామకృష్ణాపూర్ ఎస్‌ఐ శ్రీధర్, మెడీలైఫ్, సన్‌రైజ్ ఆస్పత్రుల వైద్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.
previous post

