నస్పూర్,జూలై 17:మంచిర్యాల పురపాలక పరిధిలోని నస్పూర్, సీసీసీ, సీతారాంపల్లి వార్డుల్లో కీటక జనిత వ్యాధుల నివారణకు ‘ఫ్రైడే–డ్రైడే’ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో మేయర్ ధరణి మధుకర్, స్థానిక కార్పొరేటర్లు సౌమ్య కుమారస్వామి, కర్రే శ్రీనివాస్, సంపత్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ పాల్గొని ఇంటింటికీ తిరిగి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఇళ్ల పరిసరాల్లో నీటి నిల్వలను గుర్తించి, వాటి నివారణకు ప్రజలకు సూచనలు అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా వంటి కీటక జనిత వ్యాధులను అరికట్టేందుకు ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని తెలిపారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ‘ఫ్రైడే–డ్రైడే’ కార్యక్రమంలో భాగంగా ఇళ్లలో, పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. పాత టైర్లు, కొబ్బరి బొండాలు, ఖాళీ పాత్రలు, కూలర్లు, బాత్రూమ్‌లు, వంట పాత్రలు కడిగే ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.దోమలు గుడ్లు పెట్టకుండా లార్వా దశలోనే నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. దోమతెరలు వినియోగించడం, కిటికీలకు జాలీలు అమర్చడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని వివరించారు. అలాగే శుభ్రమైన తాగునీటిని వినియోగించడం వల్ల టైఫాయిడ్, అతిసారం, వాంతులు, విరేచనాలు, కామెర్లు వంటి నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చన్నారు.ఇళ్ల వద్ద చెత్తను రోడ్లపై వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అప్పగించాలని, వైద్య ఆరోగ్యశాఖ, పురపాలక శాఖ, ఐసీడీఎస్, విద్యాశాఖలతో కలిసి ప్రజలు సమన్వయంగా పనిచేస్తే కీటక జనిత వ్యాధులను సమర్థంగా నివారించవచ్చని తెలిపారు. నీటి నిల్వ ప్రాంతాల్లో టెమీఫాస్ మందు వినియోగించి లార్వాను నిర్మూలిస్తున్నామని, అన్ని వార్డుల్లో ఫాగింగ్ కార్యక్రమాలు కూడా నిరంతరం నిర్వహిస్తున్నట్లు మేయర్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

