లక్సెట్టిపేట, జూలై 7: వర్షాకాలంలో సీజనల్, కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. మంగళవారం లక్సెట్టిపేట రైతు వేదికలో జన్నారం, దండేపల్లి, తాళ్లపేట, వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఆశా ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, ఆరోగ్య సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, ఫైలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులతో పాటు టైఫాయిడ్, అతిసారం వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఆశా కార్యకర్త వద్ద అవసరమైన మందులు అందుబాటులో ఉండాలని, గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, ప్రజాప్రతినిధుల సహకారంతో పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు వినియోగం, దోమల నివారణ చర్యలపై విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు.మాతా-శిశు సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంటూ, లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, గర్భిణులను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ఆశా కార్యకర్తలు చర్యలు తీసుకోవాలని సూచించారు. గర్భిణులను ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించరాదని, అన్ని పరీక్షలు సకాలంలో నిర్వహించి 102 అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది సమన్వయం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.క్షయవ్యాధి నియంత్రణలో భాగంగా గ్రామాల్లో ముందస్తు పరీక్షలు నిర్వహించి రోగులను గుర్తించాలని, పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాల ద్వారా స్క్రీనింగ్ చేపట్టడంతో పాటు పోషకాహార కిట్లు అందించాలని ఆదేశించారు. అలాగే రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా సమీక్ష నిర్వహిస్తామని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ అరుణశ్రీ, డాక్టర్ సమత, లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, బుక్క వెంకటేశ్వర్లు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.

