July 28, 2026
Praja Telangana
తెలంగాణ

*శాస్త్రీయ దర్యాప్తుతోనే నేరాల నియంత్రణ సాధ్యం: సీపీ అంబర్ కిశోర్ ఝా*

రామగుండం, జూలై 7: నేరాల దర్యాప్తును శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం నిర్వహించిన కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.డ్యూటీ మీట్ అనేది కేవలం అవార్డులు, రివార్డుల కోసం నిర్వహించే కార్యక్రమం కాదని, పోలీస్ అధికారులు, సిబ్బంది తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, రోజువారీ విధుల్లో స్వీయ సమీక్ష చేసుకోవడానికి ఇది ఉత్తమ వేదిక అని సీపీ పేర్కొన్నారు. పోటీల్లో గెలుపు, ఓటముల కంటే అధికారులు పొందే అనుభవమే ముఖ్యమని, ఇక్కడ నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తే దర్యాప్తు నాణ్యత మరింత మెరుగుపడుతుందని తెలిపారు.శాస్త్రీయ దర్యాప్తు, వేలిముద్రల విశ్లేషణ, ఫోరెన్సిక్ సైన్స్, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, క్రైమ్ సీన్ నిర్వహణ వంటి అంశాలపై డ్యూటీ మీట్ ద్వారా సమగ్ర అవగాహన పెంపొందుతుందని సీపీ చెప్పారు. సంక్లిష్టమైన కేసుల దర్యాప్తులో అధికారులు తమ అనుభవాలను పరస్పరం పంచుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన అధికారులు హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లో కాళేశ్వరం జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని వెల్లడించారు.ఈ డ్యూటీ మీట్‌లో సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్, యాంటీ సబోటేజ్ చెక్, కంప్యూటర్ అవగాహన, డాగ్ స్క్వాడ్ విభాగాల్లో రాత, ప్రాయోగిక పరీక్షలు, పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్, సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్, సీసీఎస్, సీసీఆర్బీ, ట్రాఫిక్, ఐటీ కోర్ విభాగాల అధికారులు, ఆర్‌ఐలు, కాళేశ్వరం జోన్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

*పర్యావరణహితంగా రాష్ట్ర గ్రీన్ కోర్ డైరెక్టర్ డా. డబ్ల్యూ.జి. ప్రసన్నకుమార్ ఉద్యోగ విరమణోత్సవం ఘనంగా నిర్వహణ*

*మంచిర్యాల కార్పొరేషన్ సమావేశంలో బీజేపీ ఆందోళన.. అవినీతి ఆరోపణలపై విచారణకు డిమాండ్*

Chief Editor: Satish Kumar

మోడీ క్యాంటీన్ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ

Share this