మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ నరేందర్ రాథోడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అమలవుతున్న అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సూచికల ఆధారంగా సమీక్షించి, ఆరోగ్య కార్యక్రమాల అమలులో జిల్లాను ముందంజలో నిలిపేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రజలందరికీ నాణ్యమైన వైద్య ఆరోగ్య సేవలు అందించడంలో వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.దోమల ద్వారా వ్యాప్తి చెందే మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి కీటక జనిత వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు, మున్సిపల్ పరిధిలోని చైర్మన్లు, కౌన్సిలర్లు, వార్డు సభ్యుల సహకారంతో ప్రజలకు వైద్య సేవలు మరింత మెరుగ్గా అందించాలని సూచించారు.జిల్లాలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ వైద్య సేవల వివరాలను ప్రజలకు తెలియజేయాలని, అత్యవసర సమయాల్లో 108 అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ప్రజలకు వేగవంతంగా వైద్య సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.మాతా శిశు సంరక్షణ, టీకాల కార్యక్రమం, కీటక జనిత వ్యాధుల నివారణ, అసంక్రమిత వ్యాధుల నియంత్రణ, క్షయ వ్యాధి నిర్మూలనతో పాటు జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల ద్వారా ప్రజలకు విస్తృతంగా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన సమస్యలను వెంటనే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి తెలియజేయాలని, అవసరమైన అనుమతులు తీసుకుని విధులు నిర్వహించాలని సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి పొరపాట్లు లేకుండా ముందుకు సాగాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ అనిల్, కార్యాలయ సంచాలకులు విశ్వేశ్వర్ రెడ్డి, డీపీఓ ప్రశాంతి, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, జిల్లా హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి మహ్మద్ రషీద్, అల్లాడి శ్రీనివాస్, నాందేవ్, కాకినాడ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

