మంచిర్యాల, మే 16 :మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ కాలనీలో గల “ప్రకృతి మిత్ర” నిలయంలో అరుదైన “మే పుష్పం” ఒకే మొక్కకు రెండు పువ్వులు వికసించి ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది.ఈ సందర్భంగా పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ “స్క్యాడోక్సస్ మల్టీఫ్లోరస్” అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ పుష్పాన్ని “ఫుట్‌బాల్ లిల్లీ”,“బ్లడ్ లిల్లీ”,“మే ఫ్లవర్” అని పిలుస్తారని తెలిపారు.వేసవి కాలంలో మాత్రమే కొద్ది రోజుల పాటు ఈ పుష్పం వికసించడం ప్రత్యేకత అని చెప్పారు.తక్కువ నీటితోనే ఎండల్లో వికసించే ఈ పుష్పం ఆకర్షణీయ రూపంతో పాటు సున్నితమైన సువాసన వెదజల్లుతుందని పేర్కొన్నారు.అరుదైన మొక్కలను ఇంటి పరిసరాల్లో పెంచడం వలన మానసిక ఆనందం,ప్రశాంతత లభిస్తాయని తెలిపారు.ఈ అరుదైన పుష్పాన్ని చూసేందుకు స్థానికులు,ప్రకృతి ప్రేమికులు ఆసక్తి చూపుతున్నారు.

