October 27, 2026
Praja Telangana
తెలంగాణ

*పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం.. శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర*

మంచిర్యాల, అక్టోబర్ 21 (నేటి ప్రజా తెలంగాణ): సమాజంలో శాంతి సామరస్యాలను నెలకొల్పడంతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించడంలో పోలీసుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. బుధవారం పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం పోలీసులు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తూ, అవసరమైన సందర్భాల్లో తమ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నారని తెలిపారు. దేశ సరిహద్దుల రక్షణలో సైన్యం, నావికాదళం, వైమానిక దళం కీలక పాత్ర పోషిస్తుండగా, దేశ అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని వివరించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, ప్రజలకు రక్షణ కల్పించడం పోలీసుల ప్రధాన బాధ్యతలని పేర్కొన్నారు.పోలీసుల అంకితభావం, నిరంతర సేవల వల్ల ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించగలుగుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో శాంతి సామరస్యాలు నెలకొన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రజలు చట్టాలు, నిబంధనలు పాటించడంతో పాటు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. పౌరులు సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న భారత సరిహద్దు గస్తీ విధుల్లో ఉన్న సీఆర్‌పీఎఫ్ బృందంపై శత్రు బలగాలు ఆకస్మిక దాడి చేయగా, జవాన్లు వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేశారని తెలిపారు. ఆ ఘటనకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు.ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణతో పాటు అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ పోలీసు శాఖ ప్రధాన బాధ్యతలని పేర్కొన్నారు. ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి పోలీసు, సైనిక జవాను సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. పోలీసు సిబ్బంది విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తూ శాఖ గౌరవాన్ని మరింత పెంపొందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక.. సత్ప్రవర్తనతో జీవించాలని సూచన:ఎస్.ఐ జె.శ్రీధర్

సెంట్రల్ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నల్లుల సంగీత గోలి శ్రీనివాస్ నియామకం

బ్యాంకు ల ఆధ్వర్యంలో షేడ్ వేయండి. పార్కింగ్ కల్పించండీ.

Chief Editor: Satish Kumar
Share this