మంచిర్యాల, సెప్టెంబర్ 30(నేటి ప్రజా తెలంగాణ):మంచిర్యాల పట్టణంలోని అశోక్ రోడ్డులో సెప్టెంబర్ 29న జరిగిన మోహన్ హత్య కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణ సీఐ ప్రమోద్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మోహన్‌కు ఆయన భార్య జమున (39) మధ్య కొంతకాలంగా వివాహ సంబంధిత మనస్పర్థలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 28 రాత్రి మోహన్, జమున మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ గొడవను మనసులో పెట్టుకున్న జమున తన 15 ఏళ్ల కుమార్తెతో కలిసి సెప్టెంబర్ 29 తెల్లవారుజామున మోహన్‌పై రోకలి దుడ్డుతో దాడి చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. తలకు బలమైన గాయం కావడంతో మోహన్ మృతి చెందినట్లు తెలిపారు.కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రమోద్ రావు తెలిపారు.

