మంచిర్యాల,ఆగస్టు 25(నేటి ప్రజా తెలంగాణ): మాదకద్రవ్యాలు,మద్యం ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు మానసిక,శారీరక సామర్థ్యాలను క్షీణింపజేసి భవిష్యత్తును నాశనం చేస్తాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.మంగళవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని మానసిక ఆరోగ్యం, పాలియేటివ్ కేర్ మరియు డ్రగ్ అడిక్షన్ సెంటర్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా డ్రగ్ అడిక్షన్ సెంటర్లో అందుతున్న వైద్య సేవలు, రోగులకు నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ తదితర అంశాలను పరిశీలించి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు.ప్రస్తుతం డ్రగ్ అడిక్షన్ సెంటర్లో 13 మందికి వైద్య సేవలు అందిస్తున్నట్లు, వారికి అవసరమైన చికిత్సతో పాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మానసిక ఆరోగ్య నిపుణులు డాక్టర్ సునీల్ కుమార్, డాక్టర్ రామ్ నాయక్ అందిస్తున్న వైద్య సేవలపై డీఎంహెచ్ఓ సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రోగులతో డీఎంహెచ్ఓ మాట్లాడి మాదకద్రవ్యాలు, ఆల్కహాల్ వినియోగం వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. మద్యం, మత్తు పదార్థాల వినియోగం వల్ల కాలేయం, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో పాటు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు. ముఖ్యంగా యువత మద్యం, మాదకద్రవ్యాలకు బానిస కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.మానసిక ఒత్తిడికి గురయ్యే వారు సమస్యలను దాచుకోకుండా మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలని డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. ఉచిత కౌన్సెలింగ్ కోసం 14416 టోల్‌ఫ్రీ నంబర్‌కు సంప్రదించవచ్చని, టెలీ-మానస్ కార్యక్రమం ద్వారా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. మాదకద్రవ్యాలకు బానిసైన వారికి మందులతో పాటు కౌన్సెలింగ్ కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు.మాదకద్రవ్యాలు కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా వ్యక్తి సామర్థ్యాన్ని తగ్గించి కుటుంబ సంబంధాలు, సామాజిక జీవితం, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆయన అన్నారు. “మాదకద్రవ్యాలకు నో చెప్పడం ద్వారా మన మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలి” అని సూచించారు. విద్యార్థులు, యువత, ప్రజలు మాదకద్రవ్యాలు, మద్యానికి దూరంగా ఉండి తమ భవిష్యత్తును కాపాడుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, పుట్ట సత్తయ్య, నామ్‌దేవ్ పాల్గొన్నారు.

