September 11, 2026
Praja Telangana
తెలంగాణ

*మందమర్రిలో నూతన కోర్టు భవనం ప్రారంభం.. సత్వర న్యాయానికి మరింత ఊతం*

మందమర్రి, ఆగస్టు 22: ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా న్యాయవ్యవస్థలో మౌలిక వసతులను మరింత బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, మంచిర్యాల జిల్లా పరిపాలన న్యాయమూర్తి నగేష్ భీమపాక అన్నారు. ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకుంటూ సోదరభావంతో మెలగాలని, అహంకారం, చిన్నచిన్న విషయాలే అనేక వివాదాలకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు.మందమర్రి పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి-కమ్-జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ న్యాయస్థానం నూతన భవనాన్ని శనివారం న్యాయమూర్తి నగేష్ భీమపాక ప్రారంభించారు. నూతన భవనం అందుబాటులోకి రావడంతో న్యాయవాదులు, కక్షిదారులు, న్యాయశాఖ సిబ్బందికి మెరుగైన వసతులు కలగడంతో పాటు కేసుల విచారణ, పరిష్కార ప్రక్రియ మరింత సౌకర్యవంతంగా సాగనుంది.ఈ సందర్భంగా న్యాయమూర్తి నగేష్ భీమపాక మాట్లాడుతూ.. “ప్రతి ఒక్కరినీ గౌరవిద్దాం.. సంతోషంగా జీవిద్దాం” అని పిలుపునిచ్చారు. సమాజంలో పరస్పర గౌరవం, సోదరభావం పెంపొందితే అనేక సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. చిన్నచిన్న విషయాలను పెద్దవిగా చేసుకోవడం వల్ల వివాదాలు పెరుగుతున్నాయని, ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.కోర్టుల్లో పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు సత్వర న్యాయం అందేలా కేసుల పరిష్కారంలో వాయిదాల సంఖ్యను తగ్గించేందుకు కృషి చేయాలని న్యాయవాదులు, సంబంధిత అధికారులకు సూచించారు. న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించే ప్రతి ఒక్కరికీ సమయానుకూలంగా న్యాయం అందేలా సమన్వయంతో పనిచేయాలని అన్నారు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. మందమర్రి, బెల్లంపల్లి పట్టణాల్లో నూతన కోర్టు భవనాల ప్రారంభంతో న్యాయపరమైన సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని తెలిపారు. నూతన భవనాల ద్వారా కోర్టు కార్యకలాపాలకు మెరుగైన వసతులు కలగడంతో కేసుల పరిష్కార ప్రక్రియ మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, న్యాయమూర్తులు, న్యాయశాఖ అధికారులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు…

మందమర్రిలో నూతన కోర్టు భవనం అందుబాటులోకి రావడంతో ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ కావడంతో పాటు, కేసుల త్వరిత పరిష్కారానికి ఇది దోహదపడుతుందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి

Related posts

*సర్వే ప్రక్రియ పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్*

Chief Editor: Satish Kumar

*స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మేయర్ దర్ని మధుకర్*

మోడీ క్యాంటీన్ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ

Share this