మంచిర్యాల,ఆగస్టు15(నేటి ప్రజా తెలంగాణ):మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ శ్రీమతి సల్ల రమ్య మహేష్, మున్సిపల్ కమిషనర్ జి. అన్వేష్‌లతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మేయర్ స్వాతంత్ర్య దినోత్సవ సందేశాన్ని అందించారు.ఈ సందర్భంగా మేయర్ దర్ని మధుకర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన తాగునీరు, మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ నిరంతరం కృషి చేస్తోందన్నారు.మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మార్గదర్శకత్వం, ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌ను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు సమష్టిగా కృషి చేస్తున్నామని తెలిపారు.అనంతరం గాంధీ పార్కు, ముకరం చౌరస్తా వద్ద కూడా జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ప్రజల సహకారంతో మంచిర్యాల నగరాన్ని మరింత అభివృద్ధి చెందిన, పరిశుభ్రమైన, సుందరమైన నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మేయర్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా మేయర్ దర్ని మధుకర్ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, మంచిర్యాల నగర ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ రాజ్ కుమార్, స్థానిక కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
previous post

