మంచిర్యాల, ఆగస్టు 19: బొగ్గు గనుల మూసివేతతో ప్రభావితమయ్యే ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల జీవనోపాధి, సామాజిక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.బుధవారం దేశవ్యాప్తంగా కోల్ ఇండియా, నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్, ఇతర బొగ్గు సంస్థలు, సింగరేణి ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, నోడల్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గనుల మూసివేత అనంతరం పర్యావరణంపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభావిత గ్రామాల ప్రజలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించడం, జీవనోపాధిని మెరుగుపరచడం, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు మాట్లాడుతూ శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల్లో చేపడుతున్న గనుల మూసివేతకు సంబంధించిన కార్యక్రమాలతో పాటు ప్రభావిత గ్రామాల్లో సామాజిక అభివృద్ధి, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో మైన్స్ ఏడీ జగన్మోహన్, పర్యవేక్షకులు మధుసూదన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

