బెల్లంపల్లి, ఆగస్టు 13: బెల్లంపల్లి వంద పడకల ఏరియా ఆసుపత్రిలో గురువారం క్షయ వ్యాధిగ్రస్తులకు ఉచిత పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ బెల్లంపల్లి ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి పరిధిలోని మండలాలకు చెందిన పేదరికంలో ఉన్న 15 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు ఈ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ క్షయ వ్యాధిగ్రస్తులు మందులతో పాటు బలమైన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లాలోని క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో పౌష్టికాహార కిట్లను అందిస్తున్నామని పేర్కొన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడంతో పాటు జిల్లాను క్షయ రహితంగా మార్చేందుకు మరింత మంది దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పోషకాహార కిట్లను అందించాలని పిలుపునిచ్చారు. ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ మాట్లాడుతూ క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా ప్రధానమంత్రి క్షయ రహిత భారత్ కార్యక్రమం ద్వారా పోషకాహార సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. క్షయ వ్యాధిగ్రస్తులకు చికిత్సతో పాటు పౌష్టికాహారం అందించడం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. జిల్లాలో మరింత మంది దాతలు క్షయ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకుని పౌష్టికాహార కిట్లను అందించి క్షయ రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి, జిల్లా ప్రదర్శన మరియు విద్యాధికారి వెంకటేశ్వర్లు, సామాజిక ఆరోగ్య అధికారి పుట్ట సత్తయ్య, నాందేవ్, కాకిరాల వెంకటేశ్వర్లు, ఆరోగ్య విద్యాధికారి శ్రీనివాస్, నేత్ర వైద్య అధికారి శంకర్, క్షయ వ్యాధి నియంత్రణ కార్యక్రమం సమన్వయకర్త శశికాంత్, మధుబాబు, అకౌంటెంట్ మురళి, ప్రయోగశాల సాంకేతిక నిపుణుడు యాదవ్, లయన్స్ క్లబ్ సభ్యులు కుక్కల నర్సయ్య, మెరుగు ప్రభాకర్, రాజమల్లు, రమేష్, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్షయ వ్యాధి నివారణ, పౌష్టికాహారం ప్రాధాన్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

