July 28, 2026
Praja Telangana
తెలంగాణ

*మంచిర్యాల ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ.. ప్రధాన కూడళ్లను పరిశీలించిన డీసీపీ భాస్కర్*

మంచిర్యాల, జూలై 17:మంచిర్యాల పట్టణంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించి రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించే లక్ష్యంతో ప్రధాన కూడళ్లను మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ శుక్రవారం పరిశీలించారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఐబీ చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా, లక్ష్మీ థియేటర్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు, ట్రాఫిక్ నిర్వహణ, రహదారి భద్రతకు చేపట్టాల్సిన చర్యలను అధికారులతో కలిసి సమీక్షించారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, కార్పొరేషన్‌గా అభివృద్ధి చెందుతున్న మంచిర్యాలలో ట్రాఫిక్ నియంత్రణ, రహదారి క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ జిల్లాలు, రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న ప్రధాన రహదారుల కారణంగా కీలక కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ పెరుగుతోందని పేర్కొన్నారు.హైదరాబాద్ ట్రాఫిక్ ఇంజినీరింగ్ నిపుణుల అధ్యయనం అనంతరం, స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో తొలి విడతలో నాలుగు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సిగ్నల్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేలా ఫ్రీ లెఫ్ట్‌లు, బొల్లార్డులు, స్టాప్ లైన్లు, అవసరమైన చోట్ల ప్యాచ్‌వర్క్‌లు,యూ-టర్న్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.ఐదు, ఆరు రహదారులు కలిసే కూడళ్లలో ప్రత్యేక ప్రణాళికతో ట్రాఫిక్ నిర్వహణ చేపడుతున్నామని, ట్రాఫిక్ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన మార్పులు, మెరుగుదలలు అమలు చేస్తామని తెలిపారు.ప్రజలు ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి నియమాలను తప్పనిసరిగా పాటించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, సిగ్నల్స్‌ను ఉల్లంఘించడం వల్ల ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తే అవకాశముందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాశ్,టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ హనన్,మేయర్ ధరణి మధు, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య,మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.

Related posts

ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న రేవంత్ సర్కార్__కాంగ్రెస్ తొత్తులుగా మారిన అధికారులు

*అతిసార నివారణకు ప్రత్యేక కార్యాచరణ_ జూన్ 1 నుంచి జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు: జిల్లా వైద్యాధికారి ఎస్.అనిత

*పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్*

Share this