మంచిర్యాల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత క్యాచ్-అప్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. సోమవారం కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె, అనంతరం కుందారం, భీమారం, చెన్నూర్ ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవలను సమీక్షించారు.ఈ సందర్భంగా వైద్యాధికారి అనిత మాట్లాడుతూ మిస్ అయిన పిల్లలు, డ్రాప్‌ఔట్ పిల్లలను గుర్తించి పూర్తి స్థాయిలో టీకాలు అందించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో ప్రత్యేక క్యాచ్-అప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టి పిల్లల వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు.గిరిజన ప్రాంతాలు, వలస కార్మికుల ప్రాంతాలు, పట్టణ బస్తీలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మీసిల్స్, రుబెల్లా వంటి వ్యాధుల నివారణకు టీకాలు ఇవ్వడంతో పాటు పిల్లలకు విటమిన్-ఏ అందించాలని తెలిపారు. నిర్మాణ ప్రదేశాలు, ఇటుక బట్టీల వద్ద ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.కోటపల్లి కేంద్రంలో కొంతమంది పిల్లలకు టీకాలు అందించగా, చెన్నూర్ ప్రాంతంలో కూడా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వడదెబ్బ నివారణ చర్యలు తీసుకోవాలని, ఓఆర్ఎస్, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

