రామకృష్ణాపూర్,అక్టోబర్ 28(నేటి ప్రజా తెలంగాణ):విశాఖపట్నంలోని రాజీవ్ ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 24, 25 తేదీల్లో నిర్వహించిన దక్షిణ భారత స్థాయి కరాటే పోటీల్లో రామకృష్ణాపూర్‌కు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు. వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న క్రీడాకారులతో పోటీపడి తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు.తెలంగాణ స్పోర్ట్స్ కరాటే డో అసోసియేషన్ తరఫున రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు వివిధ వయో, బరువు విభాగాల్లో పోటీపడి రజత, కాంస్య పతకాలు సాధించారు. తస్విక కటా విభాగంలో కాంస్య పతకం, కుమితే విభాగంలో రజత పతకం సాధించింది. మనీష్ 25 కిలోల కటా విభాగంలో రజత పతకం దక్కించుకున్నాడు. సంవేధ్య 25 కిలోల కటా, ఫైట్ స్పారింగ్ విభాగాల్లో కాంస్య పతకాలు సాధించింది. ఆదిత్య వర్ధన్ 52 కిలోల విభాగంలో, అనన్య 24 కిలోల కటా విభాగంలో, శ్రీ వైష్ణవి 22 కిలోల విభాగంలో కాంస్య పతకాలు సాధించారు. ఆరోహి 13 ఏళ్ల వయో విభాగంలో 38 కిలోల కటా విభాగంలో, యశస్విని 12 ఏళ్ల వయో విభాగంలో 38 కిలోల కటా విభాగంలో కాంస్య పతకాలు సాధించి విజయాలు నమోదు చేశారు.క్రీడాకారులు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో పోటీల్లో రాణించి పతకాలు సాధించడం పట్ల తెలంగాణ స్పోర్ట్స్ కరాటే డో అసోసియేషన్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రామస్వామి, కోచ్ జూల శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రామకృష్ణాపూర్ క్రీడాకారులు దక్షిణ భారత స్థాయిలో ప్రతిభ చాటడం పట్ల క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

