మందమర్రి, సెప్టెంబర్ 25 (నేటి ప్రజా తెలంగాణ):సింగరేణి సీఎంఓ డాక్టర్ కిరణ్ రాజ్‌కుమార్, మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ ఆదేశాల మేరకు రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి వైద్య నిపుణులు కల్యాణిఖనిలోని సింగరేణి హైస్కూల్లో శుక్రవారం 12/12 అనీమియా (రక్తహీనత) స్క్రీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డీవైసీఎంఓ (అడ్మిన్) డాక్టర్ మధుకుమార్, పీడియాట్రిషియన్ డాక్టర్ శైలజ మాట్లాడుతూ విద్యార్థుల్లో రక్తహీనతను ప్రారంభ దశలోనే గుర్తిస్తే తగిన ఆరోగ్య సూచనలు, అవసరమైన వైద్య సేవలు అందించవచ్చని తెలిపారు. రక్తహీనత నివారణకు పోషక విలువలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు. ఐరన్, ప్రోటీన్లు, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు వంటి ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని వివరించారు.సమయానికి భోజనం చేయడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన సమయంలో వైద్యులను సంప్రదించాలని సూచించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి మంచి ప్రతిభ కనబరచగలరని పేర్కొన్నారు.అనంతరం విద్యార్థులకు రక్తహీనత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అవసరమైన విద్యార్థులకు తదుపరి వైద్య సూచనలు అందించారు. కార్యక్రమంలో సింగరేణి హైస్కూల్ హెడ్మాస్టర్ పురుషోత్తం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
previous post

