October 4, 2026
Praja Telangana
తెలంగాణ

*నేర నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞాన వినియోగం: సిపి అంబర్ కిషోర్ ఝూ*

రామగుండం,సెప్టెంబర్ 15(నేటి ప్రజా తెలంగాణ):రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆగస్టు నెల నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసులు, తీవ్రమైన నేరాలు, మహిళలు, బాలలకు సంబంధించిన కేసులు, గంజాయి, ఆస్తి నేరాలు, అదృశ్యమైన వ్యక్తుల కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు.పెండింగ్ కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని, నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని అంబర్ కిషోర్ ఝా సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గస్తీ, వాహన తనిఖీలను విస్తృతం చేయాలని ఆదేశించారు. మహిళలు, బాలల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, షీ టీమ్స్ కార్యకలాపాలను విస్తృతం చేయాలని తెలిపారు.గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. ప్రతి మండప నిర్వాహకుడి వివరాలను సేకరించి, మండపాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. వినాయక మండపాల్లో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా, ఇతరులకు పంపించినా చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి, ఏసీపీలు జి. కృష్ణ, ఆర్. ప్రకాశ్, వెంకటేశ్వర్లు, కిరణ్‌కుమార్, నాగేంద్ర గౌడ్, సి.హెచ్. శ్రీనివాస్, రవీందర్, ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్‌రావు, రంగారెడ్డితో పాటు సీఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Related posts

*బొక్కలగుట్ట సర్వీస్ రోడ్డు పనులపై డీసీపీ భాస్కర్ పరిశీలన*

Chief Editor: Satish Kumar

*విశిష్ట ప్రతిభా పురస్కారం అందుకున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్*

Chief Editor: Satish Kumar
Share this