October 3, 2026
Praja Telangana
తెలంగాణ

*ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో 200 మట్టి వినాయకుల ఉచిత పంపిణీ*

మంచిర్యాల,సెప్టెంబర్ 13(నేటి ప్రజా తెలంగాణ):వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ప్రకృతి మిత్ర తెలంగాణ ఆధ్వర్యంలో ఆదివారం మంచిర్యాల కలెక్టరేట్ రోడ్డులోని టీఎన్జీవోస్ కాలనీలో శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి ఆవరణలో 200 బంకమట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.ప్రకృతి మిత్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ అథారిటీ పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలాశయాలు, జీవవైవిధ్యం, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం పూర్వీకులు పూజించిన బంకమట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించి పూజించాలని సూచించారు. అదే నిజమైన భక్తి, సంప్రదాయమని తెలిపారు.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనం వల్ల నీటిలో అవక్షేపాలు ఏర్పడి నీటి నాణ్యత దెబ్బతింటుందని, నీటిలో ఆక్సిజన్ స్థాయులు తగ్గి జలచరాలు, ఇతర జీవులపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. విగ్రహాల తయారీలో వినియోగించే విషపూరిత రసాయనాల వల్ల కార్మికుల ఆరోగ్యానికి కూడా హాని కలిగే అవకాశం ఉందన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు దూరంగా ఉండి స్టీల్, వెదురు బుట్టలు, ప్రసాద వితరణకు ఆకు డొప్పలు, స్టీల్ పాత్రలు వినియోగించాలని సూచించారు.“మట్టి గణపతే మహా గణపతి.. పీఓపీ వద్దు.. బంకమట్టి వినాయకుడే ముద్దు” అంటూ పర్యావరణహిత వినాయక చవితి నిర్వహణకు ఆయన పిలుపునిచ్చారు.టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు దూరంగా, పర్యావరణహిత పదార్థాలతో నిర్వహించనున్నట్లు తెలిపారు. మట్టి వినాయకుల పంపిణీ చేపట్టిన గుండేటి యోగేశ్వర్‌ను అభినందించారు.నెక్స్ ఐరా ఐటీ కంపెనీ ఎండీ మోతే శరత్ చంద్ర మాట్లాడుతూ ఇలాంటి పర్యావరణహిత కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, భవిష్యత్‌లోనూ తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ నాయకులు పొన్న మల్లయ్య, శ్రీపతి బాబురావు, బి. రామ్మోహన్, కే. నాగేశ్వరరావు, ఎస్. మొండయ్య, ఎన్. సత్యనారాయణ, టీ. తిరుపతి, జి. వెంకటేశం, ప్రకృతి మిత్ర సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Related posts

లోన్‌ యాప్‌.తస్మాత్‌ జాగ్రత్త

పూర్వ విద్యార్థుల నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు క్రీడా సామగ్రి అందజేత

*కుందారం పీహెచ్‌సీలో డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ*

Chief Editor: Satish Kumar
Share this