కుందారం,సెప్టెంబర్ 16 (నేటి ప్రజా తెలంగాణ):మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ బుధవారం కుందారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. కేంద్రంలో అందుతున్న వైద్య సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, క్షయ వ్యాధి నియంత్రణ చర్యలు, మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలను పరిశీలించారు.ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ ప్రతి గర్భవతిని 100 శాతం నమోదు చేసి, సకాలంలో టీకాలు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వ్యాక్సిన్ నిల్వలను పరిశీలించి అన్ని రకాల టీకాలు అందుబాటులో ఉండేలా చూడాలని, అవసరమైన టీకాలను సమీప కేంద్రాల నుంచి తెప్పించి వినియోగించాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాల్లో సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు.వాతావరణ మార్పుల నేపథ్యంలో జ్వరాలు, ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామపంచాయతీ సర్పంచులు, మండల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రభావిత గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని, పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలను సందర్శించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. పాము, కుక్క కాటుకు సంబంధించిన అత్యవసర మందులతో పాటు అన్ని రకాల అత్యవసర ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.పోషణ అభియాన్, ప్రపంచ రోగి భద్రత దినోత్సవం సందర్భంగా రోగులు, వైద్య సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. మహిళా ఆరోగ్య క్లినిక్‌లను పరిశీలించారు. ఈ-ఔషధి, టెలి-మానస్ కార్యక్రమాల ద్వారా మానసిక ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలపై డీఎంహెచ్‌వో సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, హెచ్‌ఈఓ రాంబాబు, వైద్యులు డాక్టర్ రవి, భారతి, జయమ్మ, నాగమణి, మక్బుల్ సాదిక్, రవి, రఫీక్ పాల్గొన్నారు.

