నస్పూర్,సెప్టెంబర్ 3:క్షయ వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సంగ మల్లయ్యపల్లి వార్డులో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు మొబైల్ ఎక్స్రే మిషన్ ఏర్పాటు చేసి 135 మంది రోగులకు పరీక్షలు నిర్వహించారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, స్థానిక కార్పొరేటర్ సుధాకర్, వైద్యాధికారి వెంకటేష్ కలిసి శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ తెమడతో కూడిన దగ్గు, తెమడలో రక్తం పడటం, జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టడం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించినా, శరీర భాగాల్లో వాపు లేదా శారీరక ఆరోగ్యంలో ఆకస్మిక మార్పులు వచ్చినా వెంటనే క్షయ వ్యాధి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధిని సరైన సమయంలో గుర్తిస్తే పూర్తిస్థాయిలో నివారించవచ్చని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.శిబిరంలో అనుమానిత క్షయ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులు అందించి, వ్యాధిపై అవగాహన కల్పించారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో మూడు మొబైల్ ఎక్స్రే మిషన్ల ద్వారా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్జీవోల సహకారంతో క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి పోషకాహార కిట్లు అందించేందుకు సహకరించాలని కోరారు. ప్రతి క్షయ వ్యాధిగ్రస్తుడికి చికిత్స కాలం వరకు నెలకు రూ.1,000 చొప్పున పోషకభృతి అందిస్తున్నట్లు తెలిపారు. క్షయ వ్యాధికి సంబంధించిన పరీక్షలు, మందులు పూర్తిగా ఉచితమని, “టీబీ ఓడిపోతుంది.. దేశం గెలుస్తుంది” అనే నినాదంతో క్షయ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, క్షయ వ్యాధి కోఆర్డినేటర్ సురేందర్, సురేందర్ సాయి రెడ్డి, ఆశ కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

