పెద్దపెల్లి,ఆగస్టు 30(నేటి ప్రజా తెలంగాణ): పెద్దపెల్లి పట్టణంలో ఆదివారం నిర్వహించిన నీట్-పీజీ 2026 పరీక్షల సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా, పెద్దపెల్లి డీసీపీతో కలిసి బండారికుంట సమీపంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణతో పాటు అభ్యర్థుల భద్రతకు చేపట్టిన చర్యలను పరిశీలించి, పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య, భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పరీక్షలు ముగిసిన అనంతరం ప్రశ్నపత్రాలు, ఇతర పరీక్షా సామగ్రిని సురక్షితంగా గమ్యస్థానాలకు తరలించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు.పెద్దపెల్లి జోన్ పరిధిలో మూడు పరీక్షా కేంద్రాల్లో నీట్-పీజీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. పెద్దకల్వలలోని మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల, బండారికుంట సమీపంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల, రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ట్రాఫిక్ నియంత్రణతో పాటు పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు పూర్తైన అనంతరం ప్రశ్నపత్రాలు, ఇతర పరీక్షా సామగ్రిని సురక్షితంగా తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని, అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని పోలీస్ కమిషనర్ కోరారు.

